Sunday, March 27, 2011

వాళ్లిద్దరు...

వాళ్ళిద్దరికీ పరిచయమై 
ఏడాదికి పైనే కావస్తుంది 
ఆమె అంటే అతనికెంతో ఇష్టం
చాలా మంచి స్నేహితురాలు అని అనుకున్నాడు
అతనంటే ఆమె కు కూడా అంతే మక్కువ 
స్వచ్చమైన మైత్రికి మారుపేరు
ఇదేనేమో కదా అనుకుంది
ఇద్దరి అభిరుచులు వేరైనా అభిమతాలు ఒకటే
పరస్పరం ఒకరిని ఒకరు
గౌరవించుకుంటూ ఒకరి గురించి ఒకరు 
తెలుసుకుంటూ కాలాన్ని ఆనందంగా గడుపుతున్నారు
కానీ ఎవరికి వారే వారి యొక్క భవిష్యత్తు 
ప్రణాళికలు రూపొందించుకుంటూ జీవనాన్ని
కొనసాగిస్తున్నారు
వారు మంచి స్నేహితులైనా జీవన గమనం లో
ఎవరి దారులు వారివి
ఒక రోజు ఆమెకు ఒక సమస్య వచ్చింది 
ఆ సమస్య నుంచి బయట పడటానికి తన మిత్రుని 
సహాయం కోరింది
అతను కూడా స్నేహ ధర్మం తో ఆమెకు సహాయం చేయాలనే
సంకల్పించాడు
ఆ రోజు వాళ్ళిద్దరూ పార్కులో కలుసుకున్నారు
అదే రోజు ఫిబ్రవరి 14,ప్రేమికుల రోజు 
పార్కులో కలిసిన ఆ ఇద్దరు  స్నేహితులని ప్రేమికులుగా భావించిన
కొందరు సంస్కర్తలమని చెప్పుకొనేవాళ్ళు బలవంతంగా 
వివాహం చేసారు
వాళిద్దరూ విడిపోదామనుకున్నారు
కాని మనస్సాక్షి చంపుకోలేక కలిసే జీవించసాగారు 
ఒక్క సంవత్సరం గడిచింది
అదే పార్కులో ఒకటి కాబడిన ఆ యువజంట 
అదే పార్కులో ఆత్మహత్య కు ప్రయత్నించి 
అభాసుపాలయ్యింది.

ఆమె

ఆమె కడు వృద్ధురాలు
నా అన్నవాళ్లు ఎవరు లేరు
ఒక్కప్పుడు బాగా బతికినా ఆమె నేడు
బాగా చితికిపోయింది
ఆమె దే ఊరో తెలియదు
ఎండకు వానకు ఓర్చుకుంటూ
వీలయితే బస్సు షెల్టర్ల దగ్గర
లేకపోతే ఫుట్ పాత్ ల మీద బతుకు వెళ్ళదీస్తూ
ఒకరు ఏదైనా పెడితే తింటూ
లేకపోతే పస్తుంటూ
ఒకనాడు ఎన్నో జీవితసత్యాలను చదివిన ఆమె
నేడు ఎవ్వరికి అక్కరలేని ప్రాణమున్న బొమ్మ
మనసున్న మనుషులు కూడా ఆమెను ఆదుకోలేదు
స్వచ్చందంగా సేవ చేస్తామని చెప్పుకొనే సంస్థలు
కూడా ఒకసారి ఆమె ను చూసి పెదవి విరిచాయి
ఎప్పుడు విగత జీవి గ మారుతుందో కూడా
తెలియని ఆమె భారంగా బతుకును వెల్లదీస్తూనే వుంది.
మురికికూపం లాంటి ఈ వేగవంతమైన  యుగంలో
సర్దుకుపోతూ ఇంకా జీవిస్తూనే వుంది.

Tuesday, August 11, 2009

గెలుపు

అతను ఒక కళాకారుడు.
ఎంతో ఓర్పు తో , సహనం తో
ప్రేమ తో , బాధ్యత తో ఆ కళ ను
అభ్యసించాడు.
ఆ కళ యే అతని జీవితం
ఆ కళ యే అతని ప్రపంచం
అటువంటి ఆ కళాకారుడికి ఒకానొక
సందర్భం లో ఆ కళలోనే నిష్ణాతులైన
ఎందఱో కళాకారులతో పోటి పడాల్సిన
సమయం వచ్చింది.
ఆ పోటీ లో గెలిస్తే చాలు.
ఆ కళ లో ఎన్నో మైలురాళ్ళు దాటినట్లే
దాని తో పాటు ఎంతో కీర్తి, ధనం వారి సొంతం.
ఒక్క మాట లో చెప్పాలంటే ఆ పోటీ యే
ఆ కళ ను అభ్యసించిన ఆ కళాకారులందరికి
పెద్ద పరీక్ష.
కాని ఇక్కడే ఆ కళాకారుడిని దురదృష్టం
వెంటాడింది.
ఇప్పటి దాకా తనే నిష్ణాతుడిని అనుకున్న ఈ రంగం లో
తన కన్నా నిష్ణాతులు ఎందఱో తారస పడ్డారు.
వారందరూ తన కన్నా గొప్ప కళ నే ప్రదర్శించ సాగారు.
అయినా ఆ కళాకారుడు నిరుత్సాహపడలేదు.
పోటికి సిద్దమయ్యాడు.
తనకు సాధ్యమైన మేరకు తన కళను ప్రదర్శించాడు.
ఎందఱో నిష్ణాతులను ఎదుర్కొన్నాడు.
పోటీలో ఆఖరి అంకం ముగిసింది.
ఫలితాలు వచ్చాయి.
కళ కోసం తన జీవితాన్నే ధార పోసిన ఆ కళాకారుడు
ఆ పోటి లో మాత్రం ఓడిపోయాడు.
కొన్ని దశాబ్దాలు గడిచాయి.
అదే ప్రాంతం..అదే స్థలం.. అదే కళ లో పోటీలు
ప్రారంభమయ్యాయి.
అవి ఓ ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడి స్మారక పోటీలు.
కాని ఆ ప్రఖ్యాత కళాకారుడు ఎవరో కాదు.
కొన్ని దశాబ్దాల క్రితం, అదే పోటీ లో ఘోరంగా
విఫలమైన ఓ కళాకారుడు.
నేడు ప్రజల హృదయాల్లో స్థానాన్ని పదిలపరచుకొని
నిజమైన విజేత గా "గెలుపు" ను సొంతం చేసుకున్నాడు.

స్నేహం- శత్రుత్వం


వారిద్దరూ చిరకాల స్నేహితులు.
ఎంతో సఖ్యంగా ఉండేవారు.
కష్టమొచ్చినా, సుఖమొచ్చినా కలిసే పంచుకునేవారు.
ఒకరికి అవసరమొచ్చినా మరొకరు
సహాయం చేసేవారు.
అయితే వారి స్నేహం మీద ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదు.
రోజు రోజుకి ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరుగుతూ రాసాగింది.
ఒకరినొకరు కనీసం అర్ధం కూడా చేసుకోకుండా
స్వార్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
కనీసం మాట సహాయం కూడా చేసుకోలేని స్థితి కి దిగజారింది
వారి స్నేహం.
కాలం గడుస్తున్న కొద్ది వారి మధ్య దూరం కూడా పెరగసాగింది.
జీవితం లో ఒక మధురమైన స్నేహంగా ఆరంభమైన
వారి కలయిక ఈర్ష్యా, అసూయ వంటికి ప్రలోభాలకు
లొంగి శత్రుత్వంగా విడిపోయింది.
భావితరం కూడా చరిత్ర లో వారి స్నేహాన్ని గుర్తుపెట్టుకోలేదు.
శత్రుత్వాన్నే గుర్తుపెట్టుకుంది.

Sunday, June 14, 2009

తెల్ల గులాబి


ఆ చిన్నారి పాపకు తెల్ల గులాబీలంటే చాలా ఇష్టం.
వాటికి తన చేతులతో స్వయానా నీళ్లు పోసి
పెంచడమంటే మరీ ఇష్టం.
అందుకేనేమో ఆ ఇష్టం తోటే ఓ గులాబి మొక్కను తీసుకొచ్చి
ఎంతో ప్రేమ తో నీళ్ళు పోసి తన ప్రాణం లా చూసుకుంటూ
పెంచడం ప్రారంభించింది.
కాని విచిత్రమేమిటంటే ఆ గులాబీ మొక్కకు రోజు ఒకే ఒక
తెల్ల గులాబీ పూసేది.
అది కూడా తెల్లవారు ఝామునే పూసేది.
ఆ చిట్టితల్లి తన కిష్టమైన తెల్ల గులాబీ ని చూడటం కోసం
ఉదయానే లేచి పరుగెత్తుకు వచ్చేది.
చూసి ఆనందంగా చేతితో స్పృశిస్తూ, దానికెక్కడ గాయం
తగులుతుందో అన్నట్లు నింపాదిగా ఓ పసిబిడ్డ వలె
చేతిలోకి తీసుకొని ముచ్చటపడేది.
కాని అదేం విధి విచిత్రమో ..
ఈ మధ్య అస్సలు ఆ మొక్కకు ఏ పువ్వూ పూయడం లేదు.
చిట్టితల్లి దిగులుపడి పోయింది.
దీనికి కారణం అన్వేషించాలనుకుంది.
ఇంకా తెల్ల వారు ఝామునే లేచి వచ్చి
గులాబీ మొక్క దగ్గర కూర్చుని ఆలోచించేది.
ఆ రోజు కూడా
ఎప్పటి లాగే గులాబి మొక్క దగ్గరకు వచ్చింది.
కాని విచిత్రం..
అక్కడ నిజంగానే ఒక తెల్ల గులాబి పువ్వు దర్శనమిచ్చింది.
కాని ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు.
ఎక్కనుంచో ఓ కుర్రాడు పరుగెత్తుకు వచ్చి ఒక్క క్షణం లో
ఆ పువ్వు ను త్రుంచి అందనంత దూరం పారిపోయాడు.
చిట్టి తల్లి కి కారణం అర్థమయ్యింది.
కోపం కూడా వచ్చింది.
ఆ కుర్రాడిని అందుకొనేందుకు అతని వెనుకే పరుగెత్తసాగింది.
కాని శరీర బలం సహకరించడం లేదు.
పరుగెత్తుతూ పరుగెత్తుతూ ఆయాసం తో రొప్పుతూ ఓ చోట
ఉన్నపళంగా కుప్పకూలిపోయింది.
ఆమె మనసు ఎంత బాధ పడిందో ..
ఆ బాధ తోటే వెనక్కు తిరిగి వచ్చి కోపం తో
తను పెంచిన మొక్కనే ఇష్టానుసారంగా పీకి పెకలించేసింది.
కాని ఆమెకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు.
మర్నాడు ఉదయానే లేచి తను పెకలించిన మొక్కను ఆర్ద్రత తో
చూడటానికి వెళ్ళింది.
కాని విచిత్రం
ఆ ప్రదేశం లో రెండు తెల్ల గులాబీ మొక్కలున్నాయి..
వాటి రెండింటికీ రెండు తెల్ల గులాబీ పూలున్నాయి.

Saturday, June 13, 2009

ప్రేమ - వంచన


ఆమెకు అతనంటే ఇష్టం
అతనికి కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం .
ఆమె అతనే తన సర్వస్వం అనుకుంది
అతను కూడా ఆమే తన లోకం అనుకున్నాడు.
కాని మనసనేది చాలా చెడ్డది కొన్ని సందర్భాలలో
అది ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించదు.
కాలం ఎన్నో పాఠాలు నేర్పుతుంది దానికి
అటువంటి పాఠాలే నేర్చుకున్నాడు అతను
ఆమె ప్రేమలో సత్యం లేదనుకున్నాడు.
మనసు పరి పరి విధాల ఆలోచించింది.
కాని ఆ ఆలోచనా తరంగాలు
యదార్థానికి పట్టం కట్టలేకపోయాయి.
వాస్తవాలని అంగీకరించలేకపోయాయి.
అప్పుడే ఎంచుకున్నాడు అతను ఓ మార్గం
ఆ మార్గానికి
అనుగుణంగా దిక్కులను సవరించుకున్నాడు
ఆ దిక్కుల వెంబడే తన పయనాన్ని సాగించాడు.
కాని ఆ పయనం అడ్డ దారిలో సాగింది.
అయితే మనసు అదే నిజమైన దారని నమ్మబలికింది.
ఆ నమ్మకం తోనే ఆత్మవంచన గావించుకుంటూ
అతడు ఆమెను నమ్మించి ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి
సజీవ సమాధి చేసాడు.
ప్రేమనేది ఇప్పుడు శాశ్వతంగా చచ్చిపోయింది
అతని దృష్టి లో .
కాని ఆమె ప్రేమ చావలేదు
అంతర్వాహిని లో ఒక అపురూప కణంగా మారి అంతులేని
జీవనది లో అంతర్భాగమై అతని భావి తరానికి
కపటం లేని తన ప్రేమ గురించి కన్నీటి తో కథలుగా
చెప్పడం ప్రారంభించింది.

Thursday, June 11, 2009

యుద్ధ ఖైదీ


ఆ వృద్దుడు కొన్ని సంవత్సరాలుగా
చెరసాల లోనే మ్రగ్గుతున్నాడు.
ఎప్పుడు విముక్తి లభిస్తుందో తెలియదు.
అనేకనేక రోగాల బారిన పడి
జీవచ్ఛవం లా ఆ జైలు గోడలకే పరిమితమైపోయాడు.
ఆయినా ఏదో తెలియని కించిత్ గర్వం ఆ ముసలివాడి
కళ్ళలో సూచన ప్రాయంగా కనిపించసాగింది.
అనేక సంవత్సరాల క్రితం యవ్వనం లో ఆ వృద్దుడు
ఒక రాజ్యానికి అధిపతి
రాజసం ఉట్టిపడే తేజస్సు తో తన రాజ్యాన్ని పాలించేవాడు.
రాజదర్పం తో తన సౌఖ్యాల కోసం ప్రజలపై
ఎక్కువ శిస్తులు విధిస్తూ
ఈ రాజు మనకు భారం రా దేవుడా అని వారు అనుకొనేలా చేసాడు.
ఎందరో స్త్రీలను చెరపట్టాడు.
ఎందరో సజ్జనులను హింసించాడు.
అయినా కాలం అనేది ఎప్పడూ ఒకేలా వుండదు.
ఈ రాజు కంటే వెయ్యి ఏనుగుల బలం గల ఓ రాజ్యాధిపతి
దండెత్తి వచ్చి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు.
ప్రజలను హింసించే ఆ దుష్ట రాజు ను పట్టి బంధించాడు.
సర్వం కోల్పోయిన ఆ రాజు యుద్ధ ఖైదీ గా మారాడు.
అనేక సంవత్సరాలుగా జైలు గోడలకే అంకితమైపోయాడు.
ఎప్పుడు విముక్తి లభిస్తుందో కూడా తెలియని చోట
ఒక వైపు తన వృద్ద శరీరం నరకయాతన కు గురవుతున్నా
రాజసం అనే దర్పం తో ఆజ్ఞానమనే అంధకారం లో
అలమటిస్తూనే వున్నాడు.