Wednesday, June 10, 2009

ఆతృత


మిట్ట మధ్యాన్నం వేళ తన తల్లిని వెతుక్కుంటూ
ఆ లేగదూడ కీకారణ్యం లో సంచరిస్తూ
చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది
చుట్టూ చూస్తె ఒక్క చిన్న పిట్ట కూడా లేదు
అంత నిశ్శబ్దం
భయకరమైన ఆ నిర్మానుష్య ప్రదేశంలో
ఓ మర్రిచెట్టు నీడలో ఓ పెద్ద పులి చేతిలో గాయపడి
రక్తసిక్తమైన శరీరంతో ఓ గోమాత కనిపించింది.
లేగదూడ ఆతృత తో దగ్గరికి వెళ్లి చూసింది.
ఇంకెవరు ?
ఆ గోమాత తన తల్లే ..
రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ తన బిడ్డ ఎదుటే
మరణించింది.
లేగదూడ కళ్ళ వెంబడి అశ్రుధారలు జలజలా రాలాయి.
మర్నాడు ..
అదే ప్రాంతం
అదే కీకారణ్యం లో ఒక భయంకర తుఫాను
ఆ తుఫాను తాకిడి కి ఆ దట్టమైన అడవి సైతం
నిలువెల్లా కంపించింది.
చెట్లు నేల కూలాయి.
అదే సమయం లో ఓ మహావృక్షం నేలకూలి
అటు వైపు వస్తున్న ఓ పెద్దపులి
మీద పడింది.
తీగలు పెనవేసుకున్న ఆ వృక్షం చెర నుండి
విడిపించుకోలేక ఆ పులి ఆపసోపాలు పడుతూ
ఆర్ద్రత తో భీకరంగా గర్జించసాగింది.
ఆ చెట్టు ఇరుకున నలిగిపోతూ నరకయాతన ను
అనుభవిస్తున్న తన తల్లి ని చూసి పులికూన
కన్నీరు కారుస్తూ గొంతు పెగలక పోయినా
ఆతృత తో దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూనే వుంది.
కాని ఆ అరుపులు ఆ మలయమారుతపు హొరు లో
కలిసిపోయాయి.

2 comments:

  1. చాలా బాగా రాసారు ... మన్సులో తెలియని బాధ అనిపించింది చదివితే

    ReplyDelete
  2. food chain అని ఎంత సరిపెట్టుకున్నా ఏ జీవి మరణంలోనైనా వున్న బాధ, అందునా పసికూనల రోదనలు నన్ను చాలా వేదనకి గురిచేస్తాయి. వార్తల్లోనే, దృశ్యంలోనే భరించలేని నన్ను చూసి గేలి చేసినా ఎన్నిసార్లైనా ఈ మాదిరి ప్రస్తావనలు మనసుకి ఎపుడూ అదే తాకిడిస్తాయి. మొన్న నా కారుకి చెయ్యి అడ్డంపెట్టి ఒక చిన్నబాబు బాతుని, దాని పిల్లల్ని రోడ్డు దాటించాడు. భూతదయ మెండుగా కలవారికీ లోటూలేదు. బలవంతుడే బ్రతకాలన్న నీతీ మారదు. ఈ రెండిటి సమన్వయమే సృష్టిలోని చరాచర జీవకోటి ధర్మం.

    ReplyDelete