Sunday, June 14, 2009

తెల్ల గులాబి


ఆ చిన్నారి పాపకు తెల్ల గులాబీలంటే చాలా ఇష్టం.
వాటికి తన చేతులతో స్వయానా నీళ్లు పోసి
పెంచడమంటే మరీ ఇష్టం.
అందుకేనేమో ఆ ఇష్టం తోటే ఓ గులాబి మొక్కను తీసుకొచ్చి
ఎంతో ప్రేమ తో నీళ్ళు పోసి తన ప్రాణం లా చూసుకుంటూ
పెంచడం ప్రారంభించింది.
కాని విచిత్రమేమిటంటే ఆ గులాబీ మొక్కకు రోజు ఒకే ఒక
తెల్ల గులాబీ పూసేది.
అది కూడా తెల్లవారు ఝామునే పూసేది.
ఆ చిట్టితల్లి తన కిష్టమైన తెల్ల గులాబీ ని చూడటం కోసం
ఉదయానే లేచి పరుగెత్తుకు వచ్చేది.
చూసి ఆనందంగా చేతితో స్పృశిస్తూ, దానికెక్కడ గాయం
తగులుతుందో అన్నట్లు నింపాదిగా ఓ పసిబిడ్డ వలె
చేతిలోకి తీసుకొని ముచ్చటపడేది.
కాని అదేం విధి విచిత్రమో ..
ఈ మధ్య అస్సలు ఆ మొక్కకు ఏ పువ్వూ పూయడం లేదు.
చిట్టితల్లి దిగులుపడి పోయింది.
దీనికి కారణం అన్వేషించాలనుకుంది.
ఇంకా తెల్ల వారు ఝామునే లేచి వచ్చి
గులాబీ మొక్క దగ్గర కూర్చుని ఆలోచించేది.
ఆ రోజు కూడా
ఎప్పటి లాగే గులాబి మొక్క దగ్గరకు వచ్చింది.
కాని విచిత్రం..
అక్కడ నిజంగానే ఒక తెల్ల గులాబి పువ్వు దర్శనమిచ్చింది.
కాని ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు.
ఎక్కనుంచో ఓ కుర్రాడు పరుగెత్తుకు వచ్చి ఒక్క క్షణం లో
ఆ పువ్వు ను త్రుంచి అందనంత దూరం పారిపోయాడు.
చిట్టి తల్లి కి కారణం అర్థమయ్యింది.
కోపం కూడా వచ్చింది.
ఆ కుర్రాడిని అందుకొనేందుకు అతని వెనుకే పరుగెత్తసాగింది.
కాని శరీర బలం సహకరించడం లేదు.
పరుగెత్తుతూ పరుగెత్తుతూ ఆయాసం తో రొప్పుతూ ఓ చోట
ఉన్నపళంగా కుప్పకూలిపోయింది.
ఆమె మనసు ఎంత బాధ పడిందో ..
ఆ బాధ తోటే వెనక్కు తిరిగి వచ్చి కోపం తో
తను పెంచిన మొక్కనే ఇష్టానుసారంగా పీకి పెకలించేసింది.
కాని ఆమెకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు.
మర్నాడు ఉదయానే లేచి తను పెకలించిన మొక్కను ఆర్ద్రత తో
చూడటానికి వెళ్ళింది.
కాని విచిత్రం
ఆ ప్రదేశం లో రెండు తెల్ల గులాబీ మొక్కలున్నాయి..
వాటి రెండింటికీ రెండు తెల్ల గులాబీ పూలున్నాయి.

2 comments:

  1. అద్బుతం
    కవిత్వంలోను, జీవితంలోను ఇంత సున్నితత్వం చూసి ఎన్నాళ్లయిందీ.
    మంచి కవిత అభినందనలు.

    ReplyDelete
  2. మీ కవితలు అప్పుడప్పుడు చదువుతున్నాను.. చాలా బాగా రాస్తూన్నారు

    ReplyDelete